ఆమె అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడినే అతి దారుణంగా హత్య చేసింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడనే కోపంతో ప్లాన్ ప్రకారం అంతమొందించింది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సత్యం, సీతమ్మ దంపతులకు సంతానం లేరు. గుర్ల మండలం పున్నపురెడ్డి గ్రామానికి చెందిన సత్యం సోదరుడి కుమారుడు ప్రసాద్(24) ను దత్తత తీసుకున్నారు. అల్లారుముద్దుగానే చూసుకున్నారు. ఇటీవల వారికి కుమారుడు పుట్టడంతో... సొంత కొడుకు మీద ప్రేమ.. పెంపుడు కొడుకు మీద తగ్గించింది.

తమ కుమారుడిని ప్రేమగా చూసుకొని.. పెంపుడు కొడుకుని పనులకు పంపేవారు. ఈ క్రమంలో సీతమ్మ స్థానికంగా ఓ ఉపాధ్యాయుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం పెంపుడు కొడుకుకి తెలియడంతో... ఆమెను హెచ్చరించాడు. పద్దతి మార్చుకోవాలని సూచించాడు. దీంతో... ఆమె కొడుకుపై పగ పెంచుకుంది.

పథకం ప్రకారం.. పెంపుడు కొడుకును చంపేయాలని అనుకుంది. అందుకు భర్త సహాయం కూడా తీసుకోవడం గమనార్హం. మద్యం తాగించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం శవాన్ని చెరువులో పడేశారు. అతని అసలు తల్లిదండ్రులు కొడుకు కనిపించడం లేదని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.