శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని చిన్నపల్లివూరు గ్రామానికి చెందిన వివాహిత స్వాతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి చెందిన తెలగల రాధమ్మ, మోహనరావుల పెద్ద కూతురు స్వాతికి చిన్నపల్లివూరుకు చెందిన రచ్చ అప్పన్న, నీలవేణి కొడుకు దినేష్ తో 2017లో పెళ్లి జరిగింది.

 వీరికి మూడేళ్ల కొడకు సమర్పణ్ ఉన్నాడు.  ఈ నెల 11వ తేదీన ఉదయం ఆరు గంటలకు స్వాతి ఆసుపత్రికి వెళ్లి మధ్యాహ్నం మూడున్నరకు ఇంటికి వచ్చింది.  మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత స్వాతి ఫోన్ లో ఎవరితో మాట్లాడడాన్నిగుర్తించిన అత్త ఆమెను మందలించింది.

ఆ తర్వాత బహిర్భూమికి వెళ్తున్నట్టుగా చెప్పి ఇంటికి సమీపంలో 200 మీటర్ల దూరంలోని తిమ్మల రాములమ్మతోటలోకి స్వాతి వెళ్లింది. ఆమె ఎంతకు తిరిగి రాలేదు. తోటలో స్వాతి రక్తం మడుగులో కన్పించింది.

ఆమె పక్కనే కొడుకు ఏడుస్తూ కన్పించాడు. కుటుంబసభ్యులు ఆమెను గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. శ్రీకాకుళం రిమ్స్ నుండి విశాఖ కేజీహెచ్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే స్వాతి మరణించింది.

స్వాతి బంగారు చెవిదిద్దులు, చెప్పులు, జడ క్లిప్ లను సంఘటన స్థలం నుండి పోలీసులు సేకరించారు.  ఈ ఘటన స్థలానికి సమీపంలో ఖాళీ క్వార్టర్ మద్యం సీసాను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

 స్వాతి సెల్‌ఫోన్ మాత్రం లభ్యం కాలేదు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. మృతురాలి మామ, ఆడపడుచుతో పాటు అనుమానితులను విచారించినట్టుగా పోలీసులు చెప్పారు. అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు దొరకలేదని  పోలీసులు తెలిపారు. స్వాతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.