ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని అనంతపల్లి ఎర్రకాల్వలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైనట్లు తాడేపల్లిగూడెం సీఐ రవికుమార్ చెప్పారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సీఐ రవికుమార్, డిఎస్పీ రాజేశ్వర్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. రెండు నెలల క్రితం హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

యువతిని హత్య చేసి ఒక సంచిలో పెట్టి శవం పైకి రాకుండా రాయి కట్టి కాల్వలో పడేసినట్లు గుర్తించారు. కాల్వలో నీరు ఇంకిపోవడంతో శవం బయటపడింది. మృతదేహాన్ని కుక్కలు తిని వేయడంతో గుర్తు పట్టడానికి వీలు కావడం లేదు. 

నమూనాల కోసం పోలీసులు ఎముకలను సేకరించారు. మృతురాలి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఆకుపచ్చ, గులాబీ రంగు కలిగి గోల్డెన్ డిజైన్ టాప్, గ్రే కలర్ లెగ్గిన్, ఆకుపచ్చ రంగు చున్నీ, వెండి పట్టీలు ధరించినట్లు సిఐ చెప్పారు. 

హత్య అనంతపల్లిలోనే జరిగిందా, వేరే ప్రాంతంలో చంపి ఇక్కడికి తెచ్చి కాల్వలో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే మృతదేహం కాల్వలో కొట్టుకుని వచ్చిందా అనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. అన్ని పోలీసు స్టేషన్లలోని మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు.