కర్నూల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో పొలం పనులు చేస్తున్న ఓ మహిళకు 4 క్యారెట్ల వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని ఆ మహిళ స్థానికంగా ఉన్న వ్యాపారికి విక్రయించింది. ఈ వజ్రాన్ని ఆమె గుత్తిలోని ఓ వ్యాపారికి విక్రయించింది. ఆ వ్యాపారి ఆమెకు రూ. 3 లక్షలు చెల్లించినట్టుగా స్థానికుల్లో ప్రచారంలో ఉంది. 

ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతుంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల కోసం వేటను కొనసాగిస్తారు. జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లో ఏళ్ల నుండి వజ్రాల కోసం వెతుకుతుంటారు. జూన్ నుండి నవంబర్ వరకు ఈ ప్రాంతంలోని పొలాల్లో వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు. 

విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయుడు, ఆయన మంత్రి తిమ్మరుసు  ఆలయం సమీపంలో వజ్రాలు, బంగారం ఆభరణాల నిధిని దాచిపెట్టారని స్థానికులు నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా సిరివెళ్ల మండల ప్రధాన కార్యాలయంలోని నరసింహా ఆలయం చుట్టూ వజ్రాల కోసం అన్వేసిస్తారు.

కొన్ని విదేశీ సంస్థలు, సైంటిస్టులు, అమెరికా, అస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఐదేళ్లుగా వజ్రాల కోసం అన్వేషిస్తున్నాయి. మహాదేవపురం వద్ద 50 ఎకరాల భూమిని ఈ కంపెనీలు లీజుకు తీసుకొన్నాయి. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేపట్టాయి.