అప్పుల బాధ తట్టుకోలేక భర్త ఆత్మహత్య కు పాల్పడ్డాడు. చావు బతుకుల్లో ఉన్న భర్తను కాపాడుకునేందుకు ఆస్పత్రికి బయలు దేరింది అతని భార్య. కానీ ఆమె పట్ల విధి వక్రంగా చూసింది. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నక్కపల్లి వెంకట్ నగర్ కాలనీకి చెందిన చెందిన కర్రి నానాజీ (38) టైలర్‌. అతనికి భార్య గౌరీ పార్వతి, పదేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేకపోవడంతో నానాజీ శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగాడు. 

నోటి నుంచి నురగలు రావడంతో పాటు అపస్మారక స్థితికి చేరుకోవడంతో గుర్తించిన భార్య గౌరీ పార్వతి (26) వెంటనే ఆటో పిలిచి, భర్తను తీసుకుని నక్కపల్లి ఆస్పత్రికి బయలుదేరింది. ఆస్పత్రి జంక్షన్‌ వద్ద ఆటోలో నుంచి ఒక్కసారిగా జారి కిందపడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నానాజీకి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అనకాపల్లి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ పరమేశ్‌ చెప్పారు.