ఆమె నిండు గర్భిణీ. అనుకోకుండా పురుటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి వెళదామంటే.. కనీసం రవాణా సౌకర్యం కూడా లేదు. ఈ క్రమంలో ఆ నిండు గర్భిణీ నడి రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం రమణక్కపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రమణక్కపేటకు చెందిన తుమ్మల దుర్గ నిండు గర్భిణని. రువూరులోని తన సోదరి చేవురి లక్ష్మి ఇంటికి రెండురోజుల క్రితం వచ్చింది. మంగళవారం ఉదయం దుర్గకు పురిటి నొప్పులు రావటంతో 108కి ఫోన్‌ చేశారు. ఎంతసేపటికీ రాకపోవడం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తూ ఆస్పత్రికి బయలు దేరింది. కొంత దూరం వెళ్లాక సొమ్మసిల్లి నడి రోడ్డుమీదే పడిపొయింది. సమాచారం అందుకున్న ఏఎన్‌ఎంలు అక్కడికొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న గర్భిణికి సపర్యలు చేసి సురక్షిత ప్రసవం చేశారు. అంతా పూర్తయ్యాక అక్కడికి వచ్చిన అంబులెన్సులో తల్లీ బిడ్డను ఆస్పత్రికి తరలించారు.