ఆ అబ్బాయి వయసు 19, ఆమెకు 26ఏళ్లు. కాగా ఇద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి వయసు అడ్డుగా మారలేదు. అంతా బాగా సాగుతుందనుకున్న సమయంలో.. ఆ అబ్బాయి.. ఆమెకు షాకిచ్చాడు. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు.

దీంతో మోసపోయానని గుర్తించిన యువతి.. ఆ అబ్బాయి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ జిల్లాకు చెందిన యువతి(26) హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. ఆమె తల్లి దండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. ఆమెకు మూడు నెలల కింద ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

హైదరాబాద్ లో జులై 4వ తేదీన పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. తర్వాత ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి.. మళ్లీ రాకుండా పోయాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.