బేల్దారి పనికి తెలంగాణ రాష్ట్రం వెళ్లి అక్కడ ఒక మహిళతో పరిచయం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసి చెప్పా పెట్టకుండా ఆంధ్రాకు వచ్చి మరొకరిని వివాహం చేసుకున్నాడంటూ తెలంగాణకు చెందిన మహిళ ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం బోయినపల్లి మండలం వర్ధపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వనజకు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తుమ్మల మహేష్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో అనారోగ్యంతో భర్త మహేష్‌ చనిపోయాడు. 

ఈ క్రమంలో వెలిగండ్ల మండలం గండ్లోపల్లికి చెందిన జొన్నలగడ్డ నిరీక్షన్‌.. బేల్దారి పని చేసుకునేందుకు వర్దపల్లి వెళ్లాడు. అక్కడ వనజతో అతనికి పరిచయం ఏర్పడింది. అది వివాహం చేసుకునే వరకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత ఆమెతో నాలుగేళ్లు కాపురం చేసిన నిరీక్షన్ చెప్పాపెట్టకుండా ఆంధ్రాకు వచ్చేశాడు. అనంతరం గండ్లోపల్లికే చెందిన మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వనజ.. నిరీక్షన్‌కు ఫోన్‌ చేయగా తాను వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నానని చెప్పాడు.

అంతేకాకుండా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించాడు. దీంతో ఖంగు తిన్న వనజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.