పచ్చని సంసారంలో లాక్ డౌన్ చిచ్చుపెట్టింది. లాక్ డౌన్ కారణంగా ఓ భర్త తన కుటుంబానికి దూరమయ్యాడు. అతని ఎడబాటుని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బూడిదగడ్డపల్లికి చెందిన చిన్నపరెడ్డి బెంగళూరులో మెడికల్‌ స్టోర్‌ నిర్వహిస్తూ భార్య మమత, కుమార్తెలు భవ్యశ్రీ(11), నిహారిక(9)తో కలిసి ఉంటున్నాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బెంగళూరులో ఉండటం శ్రేయస్కరం కాదని భావించి భార్యాపిల్లల్ని బూడిదగడ్డపల్లిలోని తల్లిదండ్రుల వద్ద విడిచి తాను బెంగళూరులో మెడికల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. 

బూడిదగడ్డపల్లికి రావాలని కబురు పంపినా కర్ఫ్యూ కారణంగా చిన్నపరెడ్డి బెంగళూరు నుంచి రాలేకపోయాడు. దీంతో భార్య మమత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంటి ముందున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా..తల్లి ఆత్మహత్యను చిన్నారులు జీర్ణించుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా భర్త రాలేని పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ చిన్నారులను ఓదార్చడం కుటుంబసభ్యుల వల్ల కూడ ా కావడం లేదు. ఈ సంఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. భర్త దూరమయ్యాడనే బాధతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.