ఆమె అతనిని ఎంతగానో నమ్మింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అతనితోనే జీవితమంతా గడపాలని ఆశపడింది. తొందరగా పెళ్లి చేసుకొని హాయిగా జీవించాలని అనుకుంది. కానీ అతను మరోలా ఆలోచించాడు. టైంపాస్ కి ప్రేమించినట్లు నటించి.. మరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే.. అతని మోసాన్ని సదరు యువతి ముందుగానే గ్రహించింది. పెళ్లి చేసుకోవాలంటూ ఏడాదిగా బ్రతిమిలాడుతూనే ఉంది. కానీ అతను మాటమారుస్తూ వస్తున్నాడు. దీంతో.. అతను తనను మోసం చేయాలని చూస్తున్నాడని ముందుగానే గ్రహించింది. అంతే.. పథకం ప్రకారం అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు(25) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నరు. అయితే.. పెళ్లి చేసుకుందామని పావని రెండు సంవత్సరాలుగా తాతాజీని అడుగుతూనే ఉంది. అయితే.. అతను నిరాకరిస్తూ వస్తున్నాడు.

అతను ఆమెను మోసం చేయాలని అనుకుంటున్నాడని పావనికి అర్థమైపోయింది. అందుకే పథకం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్రవాహనంపై పంగిడి రమ్మని కోరింది. అనంతరం ఆమె కూడా అక్కడకు చేరుకుంది. రాత్రి వరకు ఇద్దరూ అక్కడక్కడే తిరిగారు. తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు.

ఇదే అదనుగా భావించిన పావని.. వెనక నుంచి తన బ్యాగులో నుంచి కత్తి తీసి.. తాతాజీ వీపుపై పొడిచింది. దీంతో.. తాతాజీ కింద పడిపోయాడు.  ఆ తర్వాత మెడ, తల, వీపుపై పొడిచింది. తీవ్ర రక్తస్రావమైన తాతాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అదే సమయంలో ఆ వైపు వెళుతున్న గ్రామస్థులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.