భార్య పై కోపంతో ఓ కన్నతండ్రి కసాయిగా ప్రవర్తించాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హత్య చేశాడు. స్కూల్ నుంచి తీసుకెళ్లి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

పిల్లలను పెంచి, పెద్ద చేసి, వారిని ప్రయోజకులను చేయాల్సిన తండ్రి కసాయిగా మారాడు. మద్యం, గంజాయికి బానిసై భార్యా, బిడ్డల నుంచి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. నెలకోబిడ్డను చంపుతానని బెదిరించి అన్నంత పనీ చేశాడు. బడి నుంచి కూతురును తీసుకెళ్లి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బూసిరాజు వెంకటేశ్వర్లు, వెంకటనరసమ్మ దంపతులకు 16 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు కనిగిరిలో జీవించేవారు. అయితే వెంకటేశ్వర్లు కొంత కాలం నుంచి మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు. భార్యను కూడా వేధింపులకు గురి చేయసాగాడు. దీంతో వెంకటనరసమ్మ తన పిల్లలను తీసుకొని తల్లిగారి గ్రామమైన పద్మాపురంకు వెళ్లిపోయింది. వెంకటేశ్వర్లు కూడా మార్కొండాపురం గ్రామానికి వెళ్లిపోయాడు. ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. 

కాగా.. పిల్లల పోషణ కోసం వెంకటనరసమ్మ ప్రతీ రోజు తన సోదరుడితో కలిసి కనిగిరి వచ్చేది. అక్కడ కూలి పనులు చేసి సాయంత్రం స్వగ్రామానికి వెళ్లిపోయేవారు. వీరితో పాటు తన 13 ఏళ్ల చిన్న కూతురైన మంజులను నిత్యం తమ వెంట తీసుకొని వచ్చే వారు. ఆ బాలికను పాఠశాల వద్ద దించేసి, సాయంత్రం తమతో పాటు ఇంటికి తీసుకొని వెళ్లేవారు. 

అయితే సోమవారం తండ్రి ఆ పాఠశాలకు వచ్చాడు. కూతురును తన వెంట తీసుకెళ్లాడు. ఎప్పటిలాగే సాయంత్రం స్కూలుకు వెళ్లిన వెంకటనర్ససమ్మ, సోదరుడికి మంజుల కనపించలేదు. తండ్రితో వెళ్లిందని ఇతర పిల్లలు చెప్పడంతో తమ గ్రామానికి వెళ్లిపోయారు. కాగా.. వెంకటేశ్వర్లు కూతురును ఆటోలో ఎన్‌.గొల్లపల్లి చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. దానికి సమీపంలోనే ఉన్న రాళ్ల గుట్ట దగ్గరకు బాలికను నడపించాడు. 

ఓ అనువైన సమయంలో మంజులను కిందకు తోసేశాడు. అనంతరం ఆమెపై దారుణంగా రాళ్లతో మోదాడు. తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇదిలా ఉండగా.. మరసటి రోజు ఎప్పటిలాగే సోదరుడిని తీసుకొని వెంటకనరసమ్మ కనిగిరికి వచ్చింది. గొల్లపల్లి శివారు దగ్గర జనం గుమిగూడి ఉండటంతో వెళ్లి చూసింది. కూతురు విగత జీవిగా పడి ఉండటంతో ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. బోరున విలపించింది. 

పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడింది కన్న తండ్రే అని తేల్చారు. ఏడు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. నెలకు ఓ బిడ్డను చంపుతాడని తన భర్త గతంలో బెదిరించాడని తల్లి వాపోయింది. కానీ అన్నంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదని ఆమె తీవ్రంగా రోదించింది.