ఇంట్లో మంచంపై పడుకున్న భర్తపై సలసలకాగే వేడినీళ్ళు పోసి హత్యాయత్నానికి పాల్పడిందో మహిళ. ఈ దారుణం విజయవాడలో చోటుచేసుకుంది.  

విజయవాడ : తాగుబోతు భర్త వేధింపులు భరించలేకపోయిన ఓ ఇల్లాలు దారుణానికి పాల్పడింది. ఫుల్లుగా తాగి ఇంటివచ్చిన భర్తపై సలసల మరుగుతున్న వేడినీరు పోసింది. దీంతో అతడి ఒళ్లంతా బొబ్బలెక్కి హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ చిట్టినగర్ లో దుర్గారావు, శ్రావణి దంపతులు నివాసముంటున్నారు. దుర్గారావు స్థానికంగా వున్న ఓ అల్యూమీనియం కంపనీలో పరిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఇటీవల అతడు మద్యానికి బానిసై భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేసాడు. అంతేకాదు తాగినమైకంలో ఇంటికివచ్చి భార్య శ్రావణితో గొడవపడేవాడు. భర్త వేధింపులు మరీ ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన భార్య దారుణానికి పాల్పడింది. 

వీడియో

గత ఆదివారం ఫుల్లుగా మందుతాగి ఇంటికివచ్చిన దుర్గారావు భార్యతో గొడవపడ్డాడు. ఆ మత్తులోనే వెళ్లి మంచంపై పడుకున్నాడు. కానీ కోపంతో రగిలిపోతున్న శ్రావణి సలసల కాగే వేడినీటిని తీసుకువచ్చి పడుకున్న భర్తపై పోసింది. దీంతో దుర్గారావు శరీరమంతా కాలిన గాయాలయ్యాయి. అతడి ముఖం, ఛాతీ,రెండు చేతులు, వీపుపై బొబ్బలు వచ్చి పరిస్థితి విషమంగా వుంది. ప్రస్తుతం అతడు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 

Read More కొండపల్లిలో గుండెలు పిండేసే ఘటన... పసికందును సంచిలో కుక్కి తరలిస్తూ పట్టుబడ్డ వృద్దుడు (వీడియో)

భార్య శ్రావణి తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత దుర్గారావు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.