కర్నూల్: కులాంతర వివాహం చేసుకొన్నాడని చనిపోయిన తర్వాత కూడ కొడుకు డెడ్‌బాడీ చూడకుండా వెళ్లిపోయాడు తల్లిదండ్రులు. అత్తమామల తీరును నిరసిస్తూ మృతదేహంతో భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.  జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడుద. ఈ పెళ్లి ఇష్టం లేని పేరేంట్స్ తమతో ఎలాంటి సంబంధం లేదని కొడుకుతో తెగదెంపులు చేసుకొన్నారు.అప్పటి నుండి తల్లిదండ్రులు, కొడుకుకు మధ్య రాకపోకలు లేవు.

జీపు డ్రైవర్ గా పనిచేస్తూ కొడుకు తన భార్య ఇద్దరు పిల్లలను పోషించుకొంటున్నాడు. ప్రకాశం జిల్లా పుచ్చకాయలపెల్లి వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  మృతదేహన్ని తల్లిదండ్రుల ఇంటి వద్దకు తీసుకొస్తున్నారని తెలిసి వారు ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. దీంతో మృతదేహంతో భార్య నిరసనకు దిగింది. జీపు డ్రైవర్స్ సంఘం నేతలు బాధిత కుటుంబానికి రూ. 15 వేల ఆర్ధిక సహాయం అందించారు. అంతేకాదు అంత్యక్రియలు  కూడ నిర్వహించారు.