ప్రముఖ చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్. దీని గురించి తెలియని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా  అందరూ ఈ యాప్ ని వినియోగిస్తూనే ఉంటారు. దాంట్లో తమకు నచ్చిన పాటలకు డ్యాన్స్ లు వేస్తూ అలరిస్తున్నారు. కాగా.. ఈ యాప్ వ్యామోహంలో పడి కొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారు. తాజాగా.. ఓ వివాహిత.. ఈ యాప్ కోసం భర్తనే వదిలేసింది.

ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. టిక్ టాక్ చూడొద్దని భర్త మందలించాడని.. కోపంతో అలిగి భర్తను వదిలేసి వెళ్లిపోయింది.  నెల్లూరు వెంగళరావునగర్‌కు చెందిన షేక్‌ గౌస్‌ బాషా(28), కరిష్మా(25) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొంతకాలంగా కరిష్మా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు బానిసైంది. ఫోన్‌లో ఎక్కువగా టిక్‌టాక్‌ చూస్తుండడంతో తరచూ భర్త వారిస్తున్నాడు. 

ఈ విషయంపై దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం గౌస్‌ బాషా పనికి వెళ్లిన తర్వాత కరిష్మా అలిగి ఇంటినుంచి వెళ్లిపోయింది. కాగా... భార్య కనిపించకుండా పోవడంతో.. గౌస్ భాషా పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇదిలా ఉండగా... భారత్-చైనా మధ్య సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక వైపు దేశంతో చర్చలు జరుపుతూనే సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో.. మన దేశంలో చైనా యాప్స్ పై నిషేధం విధించారు. ఆ యాప్స్ లో టిక్ టాక్ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం గమనార్హం.