ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా... అలా ఇంట్లో ఉండమే ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అతను ఇంట్లో ఉండటం నచ్చని భార్య.. దారుణంగా చంపేసింది.  ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఏలూరుకు చెందిన గుడిపూడి నాగరాజు (38)తో భూలక్ష్మికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. నాగరాజు ఏలూరు త్రీటౌన్‌ పరిధిలోని రాఘవ ఎస్టేట్స్‌లో తాపీపనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. వట్లూరు ప్రాంతానికి చెందిన తోకల సురేష్‌ అనే వ్యక్తి నాగరాజు వద్ద పనిచేస్తున్నాడు. కుటుంబంలో వ్యక్తిలా సన్నిహితంగా మెలుగుతోన్న సురేష్‌తో నాగరాజు భార్య భూలక్ష్మి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

లాక్‌డౌన్‌ వల్ల ఇంటివద్దనే ఉంటున్న నాగరాజు అడ్డు తొలగించుకోవాలని సురేష్, భూలక్ష్మి పథకం రచించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటిలో నిద్రిస్తుండగా నాగరాజు తలపై భార్య భూలక్ష్మి సురేష్‌తో కలిసి రాడ్డుతో బలంగా మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయిన నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సురేష్‌తో కలిసి భూలక్ష్మి పరా రైంది. 

సమాచారం అందుకున్న డీఎస్పీ దిలీప్‌కిరణ్, త్రీటౌన్‌ సీఐ మూర్తి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించారు. త్రీటౌన్‌ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.