చిత్తూరు: ఓ మహిళ తన భర్తను క్రికెట్ బ్యాట్ తోనూ రోకలిబండతోనూ కొట్టి దారుణంగా హత్య చేసింది. ఈ హత్యకు ఆమెకు తల్లి సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం పంచాయతీ నక్కపల్లిలో బుధవారంనాడు ఆ ఘటన చోటు చేసుకుంది. నక్కపల్లి గ్రామానికి చెందిన గోపినాథ్ రెడ్డి (36)కి అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీత (32)తో 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. 

గోపీనాథ్ రెడ్డి కొంత కాలం క్రితం బెంగళూరు వెళ్లాడు. అక్కడే ఉంటూ క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలల క్రితం కుటుంబంతో పాటు స్వగ్రామానికి వచ్చి అత్తగారింటిలో ఉంటున్నాడు. బకాయిలు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీవారు కారును తీసుకుని వెళ్లారు. 

దాంతో ట్రాక్టర్ కొనుక్కుని ఉపాధి పొందాలని గోపీనాథ్ రెడ్డి అనుకున్నాడు. అందుకు నగలు ఇవ్వాలని భార్యను అడిగాడు. దాంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి గోపీనాథ్ రెడ్డి నగల విషయంపై భార్య, అత్తలతో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో భార్య క్రికటె్ బ్యాట్, అత్త రోకలి బండతో మద్యం మత్తులో ఉన్న గోపీనాథ్ రెడ్డిని చితకబాదారు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

అత్తాభార్యల దాడిలో గోపీనాథ్ రెడ్డి మర్మాంగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. పురుషాంగం కొత్త తెగింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన విషయాన్ని భార్య, అత్త అంగీకరించారు. మృతునికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.