ప్రేమించి..పెద్దల అంగీకారంతో ప్రేమను పండించుకుని.. ఇద్దరు పిల్లల అల్లరితో అన్యోన్యంగా సాగుతున్న దంపతుల కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడో భర్త

ప్రేమించి..పెద్దల అంగీకారంతో ప్రేమను పండించుకుని.. ఇద్దరు పిల్లల అల్లరితో అన్యోన్యంగా సాగుతున్న దంపతుల కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడో భర్త.

విశాఖపట్నం పూర్ణా మార్కెట్ ప్రాంతంలోని పండా వీధికి చెందిన వడిసెల మోహన్‌రావు అదే ప్రాంతానికి చెందిన నాగమణి ప్రేమించుకుని 2004లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి దుర్గారావు, హాన్సిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మోహనరావు ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో కళాసీగా పనిచేస్తుండగా.. నాగమణి ఓ రెస్టారెంట్‌లో మేడ్‌గా పనిచేస్తోంది.

గత కొద్దిరోజుల నుంచి నాగమణి వ్యవహారశైలిపై మోహన్‌రావుకు అనుమానం మొదలైంది. ఆమె ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యతో తరచూ గొడవ పడుతూ.. వేధించడం మొదలుపెట్టాడు. వీటిని భరించలేని నాగమణి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పెద్దలు పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

అయినా మోహన్‌రావు పరిస్థితిలో మార్పు రాకపోగా.. రెండు రోజుల క్రితం టవల్‌ను భార్య మెడకు బిగించి చంపబోయాడు. ఆ సమయానికి బంధువు ఒకరు అక్కడకు రావడంతో... నాగమణి బయటపడింది. ఆ రోజు నాగమణి సమీపంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే పనికి వెళుతూ ఉంది..

ఈ క్రమంలో మోహన్‌రావు కూరగాయలు తరిగే కత్తి తీసుకుని.. నాగమణి పనిచేస్తున్న రెస్టారెంట్‌కు వెళ్లాడు.. రాత్రి 11 గంటల సమయంలో పని ముగించుకుని తోటి మహిళలతో కలిసి ఆటో ఎక్కిన భార్యను చూసి.. తాను కూడా అదే ఆటో ఎక్కాడు.. తనతో పాటు ఇంటికి వచ్చేయాలని కోరాడు..దీనికి ఆమె నిరాకరించింది.

అనంతరం ఇంటికి తిరిగి వచ్చేయాలని మరోసారి కోరాడు.. ఈ సమయంలో రానని.. ఉదయం వస్తానని సమాధానం ఇవ్వడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేక మోహన్‌రావు తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య పొట్ట, ఛాతి, భుజాలపై విచక్షణారహితంగా పొడిచాడు.

దీంతో నాగమణి, ఇతర మహిళలు గట్టిగా కేకలు వేశారు.. స్థానికులు రావడాన్ని గమనించిన మోహన్‌రావు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న నాగమణిని స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు.. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడు మోహన్‌రావును అదుపులోకి తీసుకున్నారు.