కరోనాతో వ్యక్తి మృతి: మనోవేదనతో పిల్లలతో సహా భార్య సూసైడ్
కరోనాతో ఓ వ్యక్తి మరణించడంతో కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో చోటు చేసుకొంది. ఈ విషయం గ్రామంలో విషాదాన్ని నింపింది.
ఏలూరు: కరోనాతో ఓ వ్యక్తి మరణించడంతో కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో చోటు చేసుకొంది. ఈ విషయం గ్రామంలో విషాదాన్ని నింపింది.
జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదలలో పరిమి నరసయ్యకు కరోనా సోకింది. కరోనాతో చికిత్స తీసుకొంటూ ఈ నెల 16వ తేదీన ఆయన మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు కోలుకోలేకపోయారు. నరసయ్య గురించి ఆలోచిస్తుండేవారు. కుటుంబ యజమాని మరణించడంతో తాము కూడ బతకడం వృధా అని భావించారు. నరసయ్య భార్య, కొడుకు, కూతురు ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ విషయాన్ని బంధువులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. మంగళవారం నాడు రాత్రి నరసయ్య భార్య, కొడుకు, కూతురు కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలోకి దూకారు. గోదావరికి భారీగా వరదలు వస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి సుమారు 17 లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తోంది.
ఈ ప్రవాహ వేగానికి ఈ ముగ్గురు కొట్టుకుపోయారు. నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పశివేదల నుండి రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్దకు కారులో నరసయ్య భార్య సునీత, కొడుకు ఫణికుమార్, కూతురు లక్ష్మీ అపర్ణ వచ్చారు.కారును అక్కడే వదిలి గోదావరిలో దూకారు. గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ ముగ్గురి మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.