Asianet News TeluguAsianet News Telugu

Pegasus spyware: పెగాసెస్‌పై హౌస్ కమిటీ వేస్తామంటే టీడీపీకి భయమెందుకు?: టీడీపీపై మంత్రి కన్నబాబు

ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు పెగాసెస్ వ్యవహారమై టీడీపీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి ఎందుకు భయం అని అడిగారు. ఇన్నాళ్లు ఏ కేసు పెట్టినా స్టే తీసుకువచ్చుకుంటామని టీడీపీ నేతలు ధీమాగా ఉండేవారని, పెగాసెస్ వ్యవహారంతో వారి ఆటకు చెక్ పడుతుందని అన్నారు.
 

why tdp afraiding of house committe on pegasus controversy asks minister kannababu
Author
Amaravati, First Published Mar 21, 2022, 8:02 PM IST

అమరావతి: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పైవేర్ పెగాసెస్ కొనుగోలు చేశారని ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఒక్కసారిగా పెగాసెస్ కొనుగోలు హాట్ టాపిక్‌గా మారింది. తాము కొనలేదని టీడీపీ నేతలు వాదిస్తుండగా.. వైసీపీ మాత్రం నిగ్గు తేలుస్తామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే మంత్రి కన్నబాబు టీడీపీపై విరుచుకుపడ్డారు. పెగాసెస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తామంటే టీడీపీకి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. తప్పు చేశాం.. ప్రాయాశ్చిత్తం చేసుకుందాం అనేలా వారి ధోరణి లేదని అన్నారు. ఇన్నాళ్లు వారు తమని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఉన్నారని తెలిపారు. ఎన్ని కేసులు నమోదైనా.. ఏ అభియోగాలు మోపినా.. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని బయటకు వస్తామనే భరోసాతో మెలిగారని వివరించారు. కానీ, పెగాసెస్ వ్యవహారం అలా కాదని, ఎందుకంటే దానికి స్పష్టమైన ఆధారలు ఉంటాయని, కోర్టు నుంచి స్టే తెచ్చుకుని బయటకు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. పెగాసెస్ వ్యవహారంలో నిజా నిజాలు బయటకు వస్తే.. జైలుకు వెళ్తే స్టే దొరకదని స్పష్టం చేశారు.

మంత్రి కన్నబాబు అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ, పెగాసెస్ వ్యవహారంపై కమిటీ వేయడం మంచి పరిణామం అని వివరించారు. హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి ఎందుకు జంకు అని ప్రశ్నించారు. లోకేశ్ సవాళ్లు విసురుతున్నారని పేర్కొంటూ మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్‌గా లోకేశ్ ఉన్నాడు కదా అని గుర్తు చేస్తూ ఆయన వ్యవహారం కూడా పూర్తిగా బయటపడుతుందని తెలిపారు.

పెగాసెస్ స్పైవేర్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. పెగాసెస్ వ్యవహారంపై విచారణ కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఈ కమిటీకి సంబంధించిన సభ్యులను మంగళ లేదా బుధవారం ప్రకటిస్తామని చెప్పారు.

పెగాసస్‌పై ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. బాబాయ్ హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణ చేయగలరా అని వైసీపీ ప్రభుత్వాన్ని లోకేష్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసర్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేష్ పేర్కొన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ పేర్కొన్నారు.

2019 మే వరకు ఏ ప్రభుత్వ సంస్థ కూడా పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను వాడలేదని  ఏపీ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. 

మాజీ ఇంటలిజెన్స్ డీజీ AB Venkateswara Raoసోమవారం నాడు సాయంత్రం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న భయాల్ని తొలగించాల్సిన పని ప్రభుత్వానిదని ఆయన చెప్పారు.  అప్పటి DGP  ఆఫీస్ కాకుండా మరొకరు కొని ఉండొచ్చని కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వంలో నిఘా చీఫ్ గా ఉన్న తనకు ఈ విషయమై పూర్తి సమాచారం ఉందని ఆయన గుర్తు చేశారు. Phone Hacking కానీ,Tapping కానీ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు.  Pegasus పై సందేహాలను నివృత్తి చేయాల్సి బాధ్యత తనపై కూడా ఉందని ఆయన చెప్పారు. అందుకే ఈ విషయమై తాను మీడియా ముందుకు వచ్చానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎప్పుడూ కొనని సాఫ్ట్‌వేర్ గురించి నేను సమాధానం చెప్పాలనడం హాస్యాస్పదమని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.పెగాసెస్ ను కొనుగోలు చేయలేదని ఆర్టీఏ చట్టం ప్రకారం బయటకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పెగాసెస్ వల్ల ప్రజల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. పెగాసెస్ పై అసత్యాలు, అసంబద్ద వాదనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టవద్దన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios