వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యపై తాజాగా సోషల్ మీడియా వేదికన స్పందించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

అమరావతి: సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖతో మరోసారి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, సిబిఐ విచారణపై దుమారం రేగుతోంది. తాజాగా వివేకా హత్యపై సోషల్ మీడియా వేదికన స్పందించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

''అంతా అడిగిన‌ట్టే... నేనూ అడుగుతున్నాను జ‌గ‌న్‌రెడ్డీ! మీ బాబాయ్ ని ఎవరు చంపారు? చెప్పు అబ్బాయి! మీ చిన నాయ‌న‌ని మా నాయ‌న‌ న‌రికేశాడ‌న్నావు. సీబీఐ ద‌ర్యాప్తు చేయాల‌న్నావు.. ఇప్పుడెందుకు సీబీఐని వ‌ద్దంటున్నావు.. స‌మాధానం చెప్పు సైకో రెడ్డి.. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు విచార‌ణ‌కు సీబీఐ వ‌స్తే చాలు. ఢిల్లీని గ‌డ‌గ‌డ‌లాడిస్తాన‌న్న వైఎస్ జగన్ గ‌జ‌గ‌జా వ‌ణుకుతున్నాడు'' అంటూ #WhichCMKilledHisUncle #whokilledbabai?హ్యాష్ ట్యాగ్ లతో ట్విట్టర్ ద్వారా లోకేష్ విరుచుకుపడ్డారు. 

ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉంటే ఉరి తీయాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కోరారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. వివేకానంద రెడ్డి కూతురు సునీత న్యాయం కోరారంటే దోషులు ఎవరో ప్రజలకు అర్ధమైందన్నారు. రాజకీయ లబ్ది కోసమే విజయమ్మ లేఖ రాశారని ఆయన అభిప్రాయపడ్డారు. 

read more నేటితరం గాంధారి విజయమ్మ... తాడేపల్లి దుర్యోధనుడిలా జగన్: పట్టాభిరాం సంచలనం

వివేకానందరెడ్డి హత్య విషయమై సీబీఐ విచారణను ఎందుకు కోరుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. 2019 మార్చిలో తన ఇంట్లో ఉన్న వివేకానందరెడ్డిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.

ఈ హత్య జరిగి రెండేళ్లు దాటినా కూడ ఇంతవరకు నిందితులు ఎవరో గుర్తించకపోవడంపై వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 2వ తేదీన న్యూఢిల్లీలో ఆమె సీబీఐ అధికారులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు దాటినా కూడ దోషులను పట్టుకోకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.