Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్‌ ఆత్మఘోష.. ఇప్పుడు ఎవరికి సపోర్టు చేయాలిరా దేవుడా?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిడ్డలమధ్య రాజకీయం వైరం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకవేళ వైఎస్సార్ ఇప్పుడు వుండివుంటే ఎవరికి సపోర్ట్ చేసేవారు..? కొడుకు జగన్ కా లేక కూతురు షర్మిలకా?...

Who are the political heirs of YSR? Son Jagan? Daughter Sharmila? AKP
Author
First Published Jul 8, 2024, 12:39 PM IST

YSR Jayanthi : వైఎస్ రాజశేఖర్ రెడ్డి... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు... ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని నమ్మి పాలన సాగించిన మహోన్నత నాయకుడు. ఆరోగ్య శ్రీ ద్వారా నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం... ఫీజు రియింబర్స్ మెంట్ ద్వారా అందరికీ చదువు... వ్యవసాయానికి ఉచిత విద్యుత్... ఇవి చాలు వైఎస్సార్ పాలన ఎలా సాగిందో చెప్పడానికి. ప్రజాసంక్షేమం గురించే ప్రతినిత్యం ఆలోచించే వైఎస్సార్ చివరకు ప్రజాసేవలోనే ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ ఓ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించేందకు హెలికాప్టర్ లో వెళుతుండగా ప్రమాదం జరిగింది. నల్లమల అడవిలో హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో వైఎస్సార్ ప్రాణాలు వదిలారు.  

అయితే వైఎస్సార్ మరణంతో ఆయన బిడ్డల మధ్య వారసత్వ పోరు మొదలయ్యింది. తండ్రి పలుకుబడిని ఉపయోగించుకుని రాజకీయంగా ఎదగాలని కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కూతురు వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఒక అడుగు ముందున్న వైఎస్ జగన్ ఇప్పటికే తండ్రి పేరిట పార్టీ పెట్టి విజయం కూడా సాధించారు. ఇలా వైఎస్సార్ తనయుడు జగన్ గత ఐదేళ్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు...  వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీని పాలించింది. 

మరోవైపు వైఎస్ షర్మిల సోదరుడు జగన్ తో విబేధించి తెలంగాణలో కొంతకాలం రాజకీయాలు చేసారు. సేమ్ సోదరుడి మాదిరిగానే తండ్రి పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటుచేసారు. అయితే పార్టీ సక్సెస్ కాకపోవడంతో రూటుమార్చిన షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. తండ్రి సీఎంగా కొనసాగిన  కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారి అన్న జగన్ కు షాకిచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమే అని చెప్పాలి. 

ఇలా వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం బిడ్డలిద్దరు పోటీపడుతున్నారు. తండ్రి వైఎస్సార్ పేరు వాడుకుని రాజకీయ లబ్ది పొందేందుకు కొడుకు జగన్, కూతురు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే ఎవరివైపు నిలిచేవారు..? కొడుకువైపా లేదా కూతురువైపా? ఈ ప్రశ్న తెలుగు ప్రజల్లో మెదులుతోంది. 

ఇవాళ (జూలై 8) వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులే కాదు యావత్ తెలుగు ప్రజలు ఆయనను గుర్తుచేసుకుని నివాళి అర్పిస్తున్నారు. ఇలా వైస్ జగన్, షర్మిల కూడా నివాళి అర్పించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ ఆత్మ స్వర్గంలోంచి తమ బిడ్డల పొలిటికల్ వార్ చూస్తుంటే ఏంటి పరిస్థితి..? తన బిడ్డలు చేస్తున్న రాజకీయాల గురించి ఎలా స్పందిస్తారు..? రాజకీయ వారసత్వం ఎవరికి అప్పగిస్తారు..?  అనేది ఆసక్తికర అంశం. దీంతో వైఎస్సార్ ఆత్మ స్వర్గంలోంచి కిందకు వచ్చి తన బిడ్డలను కలిస్తే ఏం మాట్లాడుతుంది అనేది సరదాగా ఊహించడం జరిగింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆ ఊహాజనిత కథనం మీకోసం... 

వైఎస్సార్ ఆత్మ స్వర్గంలోంచి దిగొస్తే..? : 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఆత్మ నేరుగా స్వర్గానికి వెళ్లింది. అక్కడ రాజభోగాలు వున్నా ఆయన ఆత్మ ఎందుకో మనశ్శాంతిగా లేదు. ఆయన పరిస్థితి చూసిన స్వర్గపాలకులు ఏమైందని ఆరా తీయగా తన బిడ్డల గురించి బాధపడుతున్నట్లు తెలిసింది. ఒకప్పుడు ప్రేమానురాగాలతో కలిసిమెలిసి వుండే కొడుకు, కూతురు ఇప్పుడు తనవల్ల అంటే తన వారసత్వం కోసం పోటీపడుతూ దూరమవడమే వైఎస్సార్ బాధకు కారణంగా తెలిసింది. ఇలా ఆయన ఆత్మఘోషను చూసి చలించిపోయిన స్వర్గ పాలకులు ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఆయనకే ఇచ్చారు... తన బిడ్డలకు కనిపించేలా వైఎస్సార్ కు వరమిచ్చారు. 

వైఎస్సార్ ఆత్మ కొడుకు జగన్ తో : 

ఇలా ఓరోజు సూర్యోదయం వేళ వైఎస్సార్ ఆత్మ తన బిడ్డలు వైఎస్ జగన్, షర్మిల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యింది. తనను పున్నామ నరకం నుండి కాపాడిన కొడుకు వద్దకు ముందుగా వెళ్లారు వైఎస్సార్. జగన్ నిద్ర లేవగానే ముందు ప్రత్యక్షమయ్యారు వైఎస్సార్... ఇది చూసి ఏదో భ్రమ అనుకుని కళ్లు నలుపుకున్నాడు జగన్. అయినా తెలుగుదనం ఉట్టిపడే వేషధారణలో తండ్రి నిలువెత్తు రూపం కళ్లముందు కనిపిస్తూనే వుంది. దీంతో జగన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయి తండ్రిని హత్తుకునేందుకు ప్రయత్నించారు... కానీ సాధ్యంకాలేదు. అప్పుడు అర్థమయ్యింది  అది తండ్రి ఆత్మ అని. 

ఇలా తండ్రి వైఎస్సార్ ఆత్మతో వైఎస్ జగన్ మాటలు ప్రారంభయ్యాయి. మీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టాను... మీ ఆశిస్సులతో 2018 ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిని అయ్యాను. మీ పేరు నిలబెట్టేలా గత ఐదేళ్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించానని జగన్ గర్వంగా తండ్రితో చెప్పుకున్నారు. వైఎస్సార్ పేరిట అందించిన సంక్షేమ పథకాల గురించి తండ్రికి వివరిచారు... అంతేకాదు ఇతర సంక్షేమ పథకాలు, అబివృద్ది గురించి తండ్రికి వివరించాడు జగన్. ఇంతచేసినా ఎందుకు ఓడిపోయావ్..? వైఎస్సార్ ఆత్మ సూటిగా ప్రశ్నించింది.  

తండ్రి ప్రశ్నతో జగన్ కంట్లొ నీళ్ళు తిరిగాయి... తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మతో పాటు చిన్నాన్న వివేకానంద రెడ్డి భార్య, కూతురు కూడా గుర్తుకువచ్చారు. కుటుంబసభ్యులే తన ఓటమిని కోరుకున్నారని... వ్యతిరేకంగా పనిచేసారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సొంత చెల్లి షర్మిల తన ప్రత్యర్థులతో చేతులుకలిపిందని... ఆమెకు తల్లి విజయమ్మ అండగా నిలిచారని చెప్పుకొచ్చాడు. అలాగే మరో చెల్లి సునీత, చిన్నమ్మ సౌభాగ్యమ్మ కూడా తనకు వ్యతిరేకంగా పనిచేసారని చెప్పుకొచ్చారు. వీరి వల్లే ఓడిపోలేదు.... కానీ తన ఓటమికి వీరుకూడా ఓ కారణమని జగన్ తండ్రితో చెప్పుకొచ్చారు. 

గతంలో మీ మంచి పేరు, కుటుంబసభ్యుల సహాయసహకారాలతో గెలిచానని... ఈసారి కుటుంబం తనకు దూరమయ్యిందని జగన్ తండ్రితో చెప్పాడు. మీ రాజకీయ వారసత్వం కోసం చెల్లి షర్మిల ప్రయత్నిస్తోందని... కానీ మీ ఆశయాలను పూర్తిచేసేది నేనే అని తండ్రికి తెలిపాడు. గత ఐదేళ్లు రాష్ట్రంలో రాజన్న పాలన సాగిందని... కాబట్టి మీ అసలు వారసుడిని నేనే అని జగన్ చెప్పుకున్నారు.  మీ ఆశిస్సులు ఎల్లపుడూ తనకే కావాలని తండ్రి వైఎస్సార్ ను కోరారు జగన్. దీంతో చిరునవ్వుతో కొడుకును ఆశీర్వదించి అక్కడి నుండి మాయమయ్యింది. దీంతో అసలు తండ్రి రాజకీయ వారసత్వం తనదేనని ఒప్పుకున్నాడో లేదో తెలియక జగన్ సంశయంలో పడ్డారు. 

వైఎస్సార్ ఆత్మ కూతురు షర్మిలతో : 

కొడుకు వైఎస్ జగన్ ముందు మాయమైన వైస్సార్ ఆత్మ కూతురు షర్మిల ముందు ప్రత్యక్షమయ్యింది. తండ్రి రూపం కళ్లముందు కనిపించగానే షర్మిల కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కూతురు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుకున్న తర్వాత వైఎస్సార్ పాయింట్ కు వచ్చారు. కూతురు రాజకీయాల గురించి అడిగారు. 

ఇందుకు షర్మిల కూడా మీ పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని... అందుకే మీరు బ్రతికున్నంతకాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తనకు ప్రజలు అవకాశం ఇవ్వలేదు... ఒక్క అవకాశం ఇస్తే రాజన్న పాలనను తిరిగి తెస్తానని చెప్పారు. మీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ అంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు... ఆ పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అధ్వాన్న స్థితిలో వుందని షర్మిల తండ్రికి తెలిపారు. ఆ పార్టీని బలోపేతం  చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ... ఇప్పుడా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని నేనే అని చెప్పారు. మీ ఆశిస్సులు నాకు కావాలని షర్మిల కోరారు. దీంతో ఆమెను కూడా ఆశీర్వదించారు వైఎస్సార్.  

జగన్,షర్మిల ముందు వైఎస్సార్ ఆత్మ ఒకేసారి : 

ఇలా ఇద్దరు బిడ్డలు వైఎస్ జగన్, షర్మిల లతో వేరువేరుగా మాట్లాడింది వైస్సార్ ఆత్మ. ఆ తర్వాత ఇద్దరి ముందు ఒకేసారి ప్రత్యక్షమే ఓ హితబోధ చేసింది. రాజకీయాలు మీ ఇష్టం... ఎవరు ప్రజలకు మంచి చేస్తే వారికి నా ఆశిస్సులు వుంటాయి. నా రాజకీయ వారసత్వం మీ ఇద్దరిదీ. ప్రజలు నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా బిడ్డలుగా మీపైనా చూపిస్తారు. కానీ వారి అభిమానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు ప్రజాసేవ చేస్తానంటే నా ఆశిస్సులు మీపై ఎప్పుడూ వుంటాయని వైఎస్సార్ చెప్పారు.  
 
విబేధాలను రాజకీయాలకే పరిమితం చేయండి... అన్నాచెల్లి అనుబంధాల మధ్యలోకి తీసుకురాకండి. మీరిద్దరూ నాకు రెండు కళ్లు... రెండూ బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి ప్రేమగా వుండండి... అమ్మను ప్రేమగా చూసుకొండి. మీరిద్దరూ కలిసుంటేనే కన్నవాళ్లుగా మాకు సంతోషం. దాన్ని మాకు దూరం  చేయకండి... ఇకనైనా ఒక్కటికండి... ప్రేమానురాగాలతో జీవించండి అంటూ వైఎస్ జగన్,షర్మిలకు సూచించారు వైఎస్సార్. ఇద్దరినీ మరోసారి ఆశీర్వదించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ మాయమైపోయింది. 

గమనిక: ఈ కథనం పూర్తిగా ఊహాజనితం. కేవలం వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్, షర్మిల రాజకీయాల గురించి చెప్పే ప్రయత్నమే ఇది. ఎవరినీ కించపర్చడమో, నొప్పించడమో ఈ కథనం ఉద్దేశం కాదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios