భీమవరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. తాను పోటీచేసిన రెండు చోట్ల ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆ బాధ నుంచి ఇంకా తేరుకోని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ నేతలు గట్టి షాక్ ఇస్తున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ఎర్రంకి సూర్యారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్,నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కో ఆర్డినేటర్ గా ఎర్రంకి సూర్యారావును నియమించారు పవన్ కళ్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి అన్నీ తానై నడిపించారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు.

అంతేకాదు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కస్థానానికే పరిమితమైంది. ఘోర పరాభవంతో ఇప్పటికీ జనసేన పార్టీ కోలుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ కో ఆర్డినేటర్ పదవికి సూర్యారావు వైసీపీ గూటికి చేరిపోవడం ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.