ఈశాన్య బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరో వైపు శ్రీశైలం నుంచి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడిచిపెట్టడంతో నాగార్జున సాగర్ జలాశయం నెమ్మదిగా నిండుతోంది. గంటకు అడుగు చొప్పున నీటి మట్టం పెరుగుతుండటంతో సోమవారం ఉదయం 7.30 ప్రాంతంలో సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.  

కృష్ణా బేసిన్‌లో ఎగువన ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద ఉధృతితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే జూరాల 66 గేట్లు ఎత్తివేయగా.. శ్రీశైలం ప్రాజెక్ట్ పది గేట్లు 33 అడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పలు లంక గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు మందులు, ఆహారం పంపిణీ చేస్తున్నారు.