అమరావతి: వైఎస్ఆర్‌సీపీ నేతల దాడులకు గురైన తమ పార్టీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు.

గురువారం నాడు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ దాడులు, టీడీపీ నేతలపై కేసుల విషయమై చర్చించారు.

వైఎస్ఆర్‌సీపీ సర్కార్ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని అక్రంగా కేసులు నమోదు చేస్తోందని  బాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు విడిచి వెళ్లిన టీడీపీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తామని  చంద్రబాబునాయుడు ప్రకటించారు.

గుంటూరులో వైఎస్ఆర్‌సీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పునరావాస కేంద్రంలో  బాధితులకు రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తానే బాధితులను ఆయా గ్రామాల్లో తీసుకెళ్లి వదిలివెళ్తానని ఆయన ప్రకటించారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కరణం బలరాంపై అక్రమంగా కేసులు బనాయించడంపై బాబు మండిపడ్డాడు. అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని గాలి జనార్దన్ రెడ్డిపై తాము పోరాటం చేశామని ఆయన గుర్తు చేశారు. 

అలాంటిది అక్రమ మైనింగ్ కు పాల్పడుతామా అని  ఆయన  ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీ కక్షపూరితమైన దాడులకు వ్యతిరేకంగా తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.