తిరుపతి: తమ పార్టీ అధికారంలోకి వస్తే  పెన్షన్‌ను రెండు వేల నుండి రూ.3వేలకు పెంచుతామని  వైఎస్ జగన్ ప్రకటించారు.

చిత్తూరు జిల్లా నుండి సమర శంఖారావం కార్యక్రమాన్ని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ బుధవారం నాడు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  చిత్తూరు జిల్లా తిరుపతిలో  నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో  ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే యుద్దంగా  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు.రానున్న ఎన్నికల్లో చంద్రబాబుతోనే పోటీ కాదన్నారు. ఎల్లో మీడియాతో కూడ పోటీ పడాలన్నారు.ఎల్లో మీడియాను కూడ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.టీడీపీ హయంలో మీరంతా ఇబ్బందులు పడ్డారని .. మీ అందరికీ తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండానే  పూర్తైనట్టుగా ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. పాదయాత్రలో తాను ప్రజల సమస్యలను చూసినట్టు చెప్పారు. 2014 లో అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు డ్రామాలు మొదలు పెట్టారని చెప్పారు.

ఇప్పటికే మూడు రకాల డ్రామాలను ప్రారంభించారని ఆయన తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశారని జగన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతోనే కాదు ఎల్లో మీడియాతో కూడ పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. 9 ఏళ్లుగా  తన కోసం మీరంతా కష్టపడ్డారన్నారు.  రాజకీయంగా, సామాజికంగా ఆదుకొంటానని జగన్ హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత  సంక్షేమ పథకాల అమల్లో బూత్ కన్వీనర్ల పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు.  రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని చెప్పారు.  తొలగించిన ఓట్ల స్థానంలో  కొత్త ఓట్ల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు.