హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే తాము ఏపీలో నష్టపోయామని స్పష్టం చేశారు. 

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదని తెలంగాణలో కూడా నష్టపోయామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తాము గెలిచిన స్థానాల్లో సెటిలర్స్ ఓట్లు బీజేపీకి పడలేదన్నారు. 

సెటిలర్స్ కూడా ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే బీజేపీకి దూరమయ్యారని ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ మోసం చేసిందని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్దేశంతో తమపై దుష్ప్రచారం చేశారని ఫలితంగా తమకు కాస్త ఇబ్బంది కలిగించిందన్నారు. ఇదే చంద్రబాబు ఏపీకీ కేంద్రం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని అసెంబ్లీ సాక్షిగా పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. 

ఇకపోతే ఆధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ప్రత్యేక హోదాపై చర్చించారని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సలహాల మేరకు ఆనాడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.