విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. 
విశాఖపట్టణంలో మంగళవారంనాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  మీడియాతో మాట్లాడారు.

2014-15 నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తోందని ఆయన గుర్తు చేశారు.రుణాలను బ్యాంకులు ఈక్విటీగా మార్చితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. 

ఈ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిన సంస్థగా చూపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఈ ఫ్యాక్టరీకి చేయూతనిస్తే నష్టాల నుండి లాభాల్లోకి వస్తోందన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కి స్వంతంగా గనులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఇలా చేస్తే టన్నుకు ఐదు నుండి ఆరు వేలు ఆదా అవుతోందని ఆయన చెప్పారు.

నష్టాల సాకుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని బైలడిల్లలోని ఎన్ఎండీసీ వద్ద గనులనుండి ఇనుప ఖనిజాన్ని తీసుకోవడం వల్ల ప్రతి ఏటా సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా భారం పడుతోందన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు తప్ప అన్ని స్టీల్ ప్లాంట్లకు స్వంతంగా గనులున్నాయని ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆయన తెలిపారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై ప్రధానితో చర్చించేందుకు సీఎం ఓ లేఖ రాసినట్టుగా ఆయన గుర్తు చేశారు.