జనసేన అధినేత పవన్ కళ్యాణ్.... అందరిలాంటి రాజకీయ నేత కాదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆయన నదుల సంరక్షణ నేపథ్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గంగా రక్షణలో ఉన్న తన వద్దకు పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పారు. అభివృద్ధిపేరిట రాజకీయ నాయకులంతా నదులను నాశనం చేస్తున్నారని... మీరు కూడా అలాంటి రాజకీయ నేతేనా అని తాను పవన్ ని అడిగినట్లు గుర్తు చేశారు. అయితే.. పవన్ తాను అలాంటి నేతను కాదని చెప్పారని తెలిపారు.

అయితే.. తనకు రాజకీయాలతో ఎలాంటి పనిలేదని చెప్పుకొచ్చారు. నీటి కోసం మూడో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిని నివారించే శక్తి భారతదేశానికి ఉందన్నారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో తాను నాలుగు దశాబ్దాలుగా ప్రకృతి పరిరక్షణ మీద ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. కానీ.. రాజకీయ నాయకులు, కార్పొరేట్లూ తనను అర్థం చేసుకోవడం లేదన్నారు.

అనంతరం బొలిసెట్టి సత్య మాట్లాడుతూ.. ‘‘ముడసర్లోవ ఏళ్ల తరబడి ఎండిపోయిన స్థితి నుంచి నేడు జలకళ సంతరించుకుంది. అయితే రాజేంద్రసింగ్ ఇచ్చిన సలహామేరకు చేపట్టిన పరీవాహక ప్రాంత పునరుద్ధరణలో కంబాలకొండ నుంచి నీరు వస్తోంది కానీ సింహాచలం నుంచి రావటం లేదు. అయితే దీనికి ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టినట్లు  మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. జనసేన నేత పవన్ కల్యాణ్ నదులు, మాతృభాష మీద చేపట్టిన ఉద్యమానికి రాజేంద్ర సింగ్ స్ఫూర్తి.’’ అని పేర్కొన్నారు.

ఇఎఎస్ శర్మ మాట్లాడుతూ.. రాజస్తాన్లో ఎండిపోయిన నదులను మళ్లీ ప్రవహింపజేసిన భగీరధుడు రాజేంద్ర సింగ్. విశాఖలో గత నలభై ఏళ్లలో వందలాది నీటి వనరులు మాయమయ్యాయి, లేదా కాలుష్యంబారిన పడ్డాయి. తాజాగా గంభీరం గడ్డకు రసాయన కాలుష్యం పట్టుకుంది. ఈ నీరు విశాఖకు సరఫరా చేస్తున్నారు. మన ప్రకృతి, మన సంస్కృతి, మన భాష కాపాడుకుంటేనే మనకు మనుగడ’’ అని చెప్పారు.