అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నానిల మధ్య ఆదివారం నాడు  ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరోకరు పరస్పరం ఆరోపణలు చేసుకొన్నారు.

 

ట్విట్టర్ వేదికగా  టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అమరావతిని కూల్చేద్దాం, హైద్రాబాద్‌ను అభివృద్ది చేద్దాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

ఈ విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  ట్విట్టర్ వేదికగా స్పందించారు.  విజయవాడ ఎంపీ కేశినేని నాని మారాల్సిందిగా కోరారు.  చంద్రబాబు బీజేపీని  సమర్ధిస్తే అందరూ జై కొట్టాలి... యూ టర్న్ తీసుకొని కాంగ్రెస్ గుంపులో చేరితే గొప్ప నిర్ణయమని స్వాగతించాలా అని  ప్రశ్నించారు. యుద్దం ఎప్పుడు చేయాలో తమ సీఎంకు తెలుసునని ఆయన చెప్పారు.


తాను నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు ఇవ్వడం, నారావారిపల్లె ఇంటికి  భద్రతను తగ్గించడంపైనే పార్టీ నేతల సమావేశంలో చర్చించి సంతాప తీర్మాణం చేశారని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 30 రోజుల్లోనే ఏపీ  ప్రజల్లో ధైర్యం కల్పించేందుకు సీఎం జగన్ ప్రయత్నించారని విజయసాయిరెడ్డి చెప్పారు.

 

ప్రజావేదిక కూల్చివేత విషయంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ముఠా చేసిన ప్రయత్నం సఫలం కాలేదని విజయసాయి రెడ్డి  ఎద్దేవా చేశారు. రేకుల షెడ్డుకు రూ.9 కోట్లు ఖర్చు చేస్తే రాజధాని భూముల్లో ఎంత అవినీతి జరిగిందనే చర్చ సాగుతోందన్నారు.

అయితే విజయసాయిరెడ్డి తనను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.  సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో పేర్లున్నవారు మారాలని  విజయసాయిరెడ్డికి కౌంటరిచ్చారు. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లొచ్చిన  వారు మారాలన్నారు.