అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మాజీమంత్రి నారా లోకేష్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని మంత్రి అనిల్ ఆరోపించారు.  

మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీమంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. అనిల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.  

అనంతరం మాట్లాడిన లోకేష్ సీఎం వైఎస్ జగన్ 16నెలలు జైళ్లో ఉన్నారంటూ మీకంటే అవినీతి పరులు ఎవరు అంటూ విమర్శించారు. లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంగళగిరిని మందలగిరి అని, జయంతిని వర్దంతి అన్న నారా లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారని విమర్శించారు. కనీసం మాతృభాష కూడా మాట్లాడటం చేతకాని వీళ్లు తమకు నీతులు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  

మంత్రి నారా లోకేష్‌కు మాతృభాషలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. ట్రైనింగ్ తీసుకుని మాట్లాడాలంటూ సెటైర్లు వేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్‌తో కుమ్మక్కై చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనగోలు చేసి ఇప్పుడు నీతికబుర్లు చెప్తున్నారని విరుచుకుపడ్డారు.