కరోనా ఎంతో మంది ప్రాణాల్ని హరిస్తోంది. సెకండ్ వేవ్ విజృంభణలో పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా బారిన పడి కృష్ణాజిల్లా ఉయ్యూరు సివిల్ కోర్ట్ న్యాయమూర్తి జాస్తి సతస్యనారాయణ మూర్తి మృతి చెందారు. 

ఇటీవలే ఆయన తండ్రి కరోనాతో మృతి చెందారు. న్యాయమూర్తి ఇంట్లో కోవిడ్ కారణంగా ఇద్దరు మృతి చెందడంతో ఉయ్యూరు బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. న్యాయమూర్తి మృతికి ఉయ్యూరు పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉండగా... రుయాలో ఆక్సిజన్ అందక మరణించిన 11 మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు  ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారం నాడు ప్రకటించారు.రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక  11 మంది మరణించారు.

సోమవారం నాడు రాత్రి ఏడున్నర గంటల సమయంంలో  ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.  దీంతో  ఐసీయూలో చికిత్స పొందుతున్న 11 మంది కరోనా రోగులు మరణించారు. మరో 30 మందిని వైద్యులు ప్రాణాపాయం నుండి తప్పించారు. తమిళనాడు ఆక్సిజన్ సరఫరా చేసే ట్యాంకర్ 20 నిమిషాల  పాటు ఆలస్యంగా రావడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించినట్టుగా చిత్తూరు కలెక్టర్ సోమవారం నాడు రాత్రి ప్రకటించారు. 

వైద్యులు సకాలంలో స్పందించని కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబసబ్యులు ఆరోపించారు. ఐసీయూ వద్ద ఫర్నీచర్ ను  మృతుల కుటుంసభ్యులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్  ఆరా తీశారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.