రాజకీయాలను సమూలంగా మార్చివేయాలన్న లక్ష్యంతో వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌కు జనం మామూలు షాకివ్వలేదు. జనసేన పార్టీని ప్రతి అంశంలోనూ చిరంజీవి ప్రజారాజ్యంతో పోలుస్తున్న జనం తాజా ఎన్నికల ఫలితాలతో ఈ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు.

తాజా ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన స్థానాల్లో నేటి ఎన్నికల్లో జనసేన పార్టీ పట్టును ప్రదర్శించిందే తప్ప.. ఆ స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. ఇంతకు మందు ప్రజారాజ్యం గెలవని రాజోలులో జనసేని గెలిచి సత్తా చాటింది.

అయితే ఇదే సమయంలో పీఆర్‌పీ గెలిచిన ఆళ్లగడ్డ, బనగానపల్లె, గిద్దలూరు వంటి చోట్ల పవన్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే నాడు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు పోటీ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి.

రాజోలులో గెలిచిన రాపాక వరప్రసాద్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఆ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా క్యాడర్ ఉంది. అక్కడి సర్పంచులు, స్థానిక నాయకులతో సంబంధ బాంధవ్యాలున్నాయి.

2014లో ఆయన పార్టీని వీడినా నియోజకవర్గంలో స్వతంత్రంగా ఉంటూనే రాజకీయాలు చేశారు. సహజంగానే బలమైన నేత కావడం, గ్రామాల్లో తనకంటూ యంత్రాంగం ఉండటం, పవన్ ఇమేజ్ కలిసి రావడంతో రాపాక విజయం సాధించారు.

గత ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యానికి 51,649 ఓట్లు రాగా.. తాజాగా జనసేనకు 50,053 ఓట్లు లభించాయి. ఇక జనసేనాని పోటీ చేసిన గాజువాక, భీమవరంలో రెండో స్థానంతో సరిపెట్టుకుని నిరాశను కలిగించారు.

ఓట్లు వేయించుకోలేకపోవడంతో పాటు స్థానికంగా ఉండరనే అంశాన్ని ఇతర పార్టీలు జనంలోకి బలంగా తీసుకెళ్లడంతో పవన్ ఓటమి పాలయ్యారు. అయితే నాడు ప్రజారాజ్యానికి గాజువాకలో పడ్డ ఓట్లతో పోలిస్తే నేడు జనసేనకు అధికంగా ఓట్లు పడ్డాయి.

ఇక నరసాపురం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని జనసేన ఎంచుకోవడం, ఆ వర్గం నుంచి కొంత మేరకు మద్ధతు లభించడంతో రెండో స్థానం లభించింది. రాజమహేంద్రవరం రూరల్‌లో గట్టి పోటీ ఇవ్వడంతో 40 వేలకు పైగా ఓట్లు సాధించకుంది.

అయితే భీమిలి, అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కొత్తపేట, తాడేపల్లిగూడెం, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, గిద్దలూరు, నెల్లూరు సిటీ, ఆళ్లగడ్డ, బనగానపల్లె, తిరుపతిలో ప్రజారాజ్యానికి వచ్చిన ఓట్లు జనసేనకు ప్రస్తుత ఎన్నికల్లో రాలేదు.