ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదఘటనలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు.

విశాఖపట్నం : ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఆదివారం కొండచరియలు విరిగిపడి ఒక ప్రైవేట్ వాహనం మీద పడిన ఘటనలో విజయనగరంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. కొండచరియలు విరిగి పడడంతో వాహనం గంగా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కూడా ఒకరు. 

వాహనం కేదార్‌నాథ్‌ నుంచి రిషికేశ్‌ కు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదసమయంలో వాహనంలో 11 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక మహిళలు, డ్రైవర్ తో సహా 11 ఉండగా, కొండచరియలు విరిగిపడడంతో వీరంతా నదిలో పడిపోయారు. 

వీరిలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఐదుగురు వ్యక్తులను రక్షించారు. మృతి చెందిన ముగ్గురిలో రవి రావు (31) ఒకరు. రవిది రాజాం మండలం బొద్దాం గ్రామం. ప్రమాదసమయంలో ఆయన భార్య కూడా ఉన్నారు. ఆమె ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు. రవి గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.