Asianet News TeluguAsianet News Telugu

కమీషన్ల కోసం కన్నతల్లిని కూడా అమ్ముకునే రకం: జగన్ పై అచ్చెన్న సంచలనం

తన జేబులు నింపుకోవడం కోసం జాతికి ద్రోహం చేసేందుకు జగన్ రెడ్డి సిద్ధపడడం సిగ్గుచేటని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

vizag steel plant privatisation... ap tdp chief atchannaidu sensational comments on cm jagan  akp
Author
Amaravati, First Published Jul 8, 2021, 11:56 AM IST

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్, అనుబంధ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై అనుమానాలున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో దక్షిణ కొరియాకు చెందిన ఫోస్కో కంపెనీకి కట్టబెట్టి వాటాలు దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాల్లో భాగమే ఈ మౌనం అనిపిస్తోందన్నారు. జేబులు నింపుకోవడం కోసం జాతికి ద్రోహం చేసేందుకు జగన్ రెడ్డి సిద్ధపడడం సిగ్గుచేటని అచ్చెన్న మండిపడ్డారు. 

''విశాఖ ఉక్కుపై ఆధారపడి లక్షలాది మంది బతుకుతుండటం జగన్ రెడ్డికి కనిపించడం లేదా.? 150 రోజులుగా స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు చేస్తున్న ఉద్యమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు.? కమిషన్లు అందితే చాలు... కన్న తల్లిని కూడా అమ్ముకుంటామనేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''గతేడాదితో పోలిస్తే దాదాపు 126 శాతం అధికంగా టర్నోవర్ సాధించిన విశాఖ స్టీల్ ను అమ్మేస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు మిన్నకుండిపోయారు.? ఆంధ్రుల హక్కు అనే పోరాటంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ జగన్ రెడ్డి మౌనం ఎందుకు.?'' అని నిలదీశారు. 

read more  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల నిరసన

''జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర ఆస్తులు అమ్మకానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు జాతి సంపదపై పడ్డాడు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ వంటి ప్రఖ్యాత కంపెనీలను కూడా అమ్ముకోవడానికి సిద్ధపడడం ప్రజలకు ద్రోహం చేయడమే. ఫోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను వెంటనే బయటపెట్టాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

''కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకించింది... అందుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి'' అని హెచ్చరించారు. 

''ప్రత్యేక హోదా విషయంలో హోరెత్తించే ప్రసంగాలు దంచి, కేంద్రం మెడలు వంచేస్తామని హడావుడి చేసిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేంద్రం వద్ద మోకరిల్లడం తప్ప చేసిందేమీ లేదు. ఉద్యమ స్పూర్తితో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విషయంలో కమిషన్ల కక్కుర్తి, దోచుకోవాలన్న ఆలోచన మాని.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పోరాడాలి. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ లేఖలు రాయడం ఆపి.. ఇకనైనా ఎదురు తిరగాలి. ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరమైతే తెలుగు జాతి ప్రాణం పోయినట్లేనని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి'' అని అచ్చెన్న సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios