కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ పట్ల విశాఖ పోర్ట్ అధికారులు అవమానకరంగా ప్రవర్తించారు. ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణబ్ ముఖర్జీ శనివారం విశాఖ చేరుకున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం బస, వసతి ఏర్పాట్లను మాత్రం విశాఖ పోర్ట్ ట్రస్ట్ అధికారులు.. పోర్ట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేశారు.

అయితే ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్‌లో నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రణబ్ బస చేసిన గదికి చుక్క నీరు కూడా వెళ్లలేదు. విషయం తెలుసుకున్న అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఏం చేయాలో తెలియక ప్రణబ్ కాన్వాయ్‌లో ఉన్న ఫైరింజన్ నుంచి నీరు కావాలని కోరారు. అయితే ఈ నీటితో స్నానం చేయడం మంచిది కాదని కొందరు సూచించడంతో పోర్ట్ అధికారులు ఆ ఆలోచన విరమించుకున్నారు.

మోటార్ ద్వారా గెస్ట్ హౌస్ ట్యాంకుల్లో నీటిని నింపాలని భావించినప్పటికీ మోటరు కాలిపోయింది. పోనీ జనరేటర్ ద్వారా చేద్దామని కొందరు సలహా ఇచ్చినప్పటికీ జనరేటర్ సైతం పనిచెయ్యడం లేదని గుర్తించారు.

దీంతో కింద నుంచి బక్కెట్ల ద్వారా నీటిని తెచ్చి స్నానానికి ఏర్పాట్లు చేశారు. మాజీ రాష్ట్రపతి అందునా భారతరత్న వంటి వ్యక్తి వస్తున్నప్పుడు ముందుగా చెక్ చేసుకోవడం, ట్రయల్ రన్ నిర్వహించడం వంటివి చేయాలి.

కానీ అవేవి పట్టించుకోకుండా పోర్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఇంత జరిగినప్పటికీ అక్కడ ఉన్న అధికారులు నీటి సమస్యను సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం.

ఈ విషయం తెలుసుకున్న పోర్ట్ డిప్యూటీ ఛైర్మన్ పీఎల్ హరనాథ్ ఈ విషయం తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. భారతరత్నకు ఇచ్చే గౌరవం ఇదేనా అని సిబ్బందిపై విరుచుకుపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హరనాథ్ ఆదేశించారు.