విశాఖపట్టణం:  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో  నర్సుగా పనిచేస్తున్న  కావ్య రోడ్డుపైనే  మంటలు అంటుకొన్న ఘటనపై కారణాలను పోలీసులు తేల్చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని  విశాఖ ఏసీపీ వైవీ నాయుడు ప్రకటించారు.

గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఏసీపీ నాయుడు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చెప్పారు. కావ్య మూడేళ్లుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.  అదే ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే  చెన్నా నరేంద్రతో  కావ్యకు పరిచయం ఉంది. ఏడాదిగా వీరిద్దరూ ప్రేమించుకొంటున్నారు.

అయితే అప్పటికే నరేంద్రకు వివాహమైంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని  కావ్య నరేంద్రపై ఒత్తిడి తెచ్చింది. దీంతో నరేంద్ర ఆమెను దూరం పెట్టారు.  ఈ విషయాన్ని కావ్య జీర్ణించుకోలేదు.

రెండు రోజుల క్రితం నరేంద్రతో తాడోపేడో తేల్చుకోవాలని  అతడికి ఫోన్ చేసింది. అప్పటికే ఆమె తన ఒంటిపై పెట్రోలు పోసుకొంది. ఇసుకతోట జంక్షన్ వద్దకు నరేంద్ర వచ్చేసరికి తనను పెళ్లి చేసుకొంటావా లేదా అని కావ్య నిలదీసింది.

అయితే తాను మాత్రం పెళ్లి చేసుకోలేనని నరేంద్ర చెప్పాడు.  అతడిని బెదిరించేందుకు కావ్య అగ్గిపుల్ల గీసింది. అయితే ప్రమాదవశాత్తు ఆమెకు మంటలు అంటుకొన్నాయి. ఆమెకు మంటలు ఆర్పేందుకు నరేంద్ర ప్రయత్నించే క్రమంలో అతడి చేతులకు కూడ గాయాలయ్యాయి. 

మంటల బాధను తట్టుకోలేక కావ్య రోడ్డుపై పరిగెత్తింది. స్థానికులు మంటలు ఆర్పి కేజీహెచ్‌లో చేర్పించారు. పోలీసుల విచారణలో  బాధితురాలు అసలు విషయాన్ని వెల్లడించిందని పోలీసులు తెలిపారు.

కావ్య నిప్పంటించుకోవడంతో  నరేంద్ర విజయనగరం పారిపోయి లాడ్జీలో బస చేశాడు. కాల్ డేటా ఆధారంగా నరేంద్రను అదుపులోకి తీసుకొని విచారిస్తే కావ్య చెప్పిన విషయాలతో అతను ఏకీభవించాడని పోలీసులు చెప్పారు.