రెండున్నర కోట్ల విలువైన గంజాయి స్మగ్లింగ్... విశాఖలో పట్టివేత
విశాఖ జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం వద్ద పోలీసుల తనిఖీ చేపట్టగా ఓ కారులో భారీగా గంజాయి పట్టుబడింది.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం వద్ద పోలీసుల తనిఖీ చేపట్టగా ఓ కారులో గంజాయి పట్టుబడింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఐచర్ వాహనంలో రంపపు పొట్టు బస్తాల మద్య గంజాయిని వుంచి తరలిస్తుండగా సంబ్బవరం పోలీసులు గుర్తించారు.
2640 కేజీల గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ గంజాయి ధర దాదాపు రెండున్నర కోట్లు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయితో పాటు తరలించడానికి ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలావుంటే ఇటీవలే గంజాయి మాఫియా లీడర్ బాబూ కాలేను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెెలిసిందే. హైదరాబాద్ నగర శివార్లలో నార్కోటెక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టగా బాబూ పట్టుబడ్డాడు. ఏపీ నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్న బాబూ కాలే నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
గత కొన్ని సంవత్సరాలుగా అతనిని పట్టుకునేందుకు ఐదు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. అనూహ్య రీతిలో ఇవాళ హైదరాబాద్‌లో బాబు కాలే పట్టుబడ్డాడు. ఆంధ్రా నుంచి గంజాయిని తీసుకుని మహారాష్ట్ర, ఢిల్లీలకు సరఫరా చేస్తున్నాడు.