విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ప్లానింగ్‌ అధికారిణి (పీవో) దేవీకుమారి ఓ పారిశ్రామికవేత్త నుంచి లంచం తీసుకోవడానికి ప్రయత్నించి..చిక్కుల్లో పడిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... డీటీసీపీ నుంచి రెండేళ్ల క్రితం ఏరికోరి వుడాకు దేవీకుమారి మారారు. ఆ తరువాత వీఎంఆర్‌డీలో భాగమయ్యారు. ప్లానింగ్‌ విభాగంలో సీయూపీ తరువాత అత్యంత కీలకమైన ప్లానింగ్‌ అధికారిణిగా పనిచేస్తున్నారు. అత్యంత ముఖ్యమైన విశాఖ సిటీ జోన్‌, శ్రీకాకుళం జోన్‌ బాధ్యతలు ప్రస్తుతం చూస్తున్నారు. ఆమె వద్దకు ఏ ఫైల్ వచ్చినా.. ఆమె చెయ్యి తడపనిది.. ఆ ఫైల్ ముందుకు కదలదని అక్కడి అధికారులు  చెబుతున్నారు.

కాగా.. కొద్ది రోజుల క్రితం ఓ పారిశ్రామికవేత్త.. సీఎం పేషీకి ఫోన్ చేశారు. ‘‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో రాష్ట్రం నంబర్‌వన్‌ స్థానంలో ఉండటం మాకందరికీ సంతోషంగానే ఉంది. కానీ, విశాఖపట్నం అధికారుల తీరే ఇబ్బందికరంగా ఉంది. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి అక్కడి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భారీమొత్తంలో లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. లంచం ఇవ్వని కారణంగా వీఎంఆర్‌డీఏలో నా ఫైలు ఆపివేశారు. నాలుగు నెలలైనా అక్కడి మహిళా అధికారి ఆ ఫైల్‌పై స్పందించడం లేదు’’ అని ఆయన ఫిర్యాదు చేశారు. 

ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి సతీశ్‌చంద్ర ఆ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించారు. వెనువెంటనే వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బసంత్‌కుమార్‌ను లైనులోకి తీసుకొన్నారు. సదరు పారిశ్రామికవేత్త ఫైలు పరిష్కారంలో జాప్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై బసంత్‌కుమార్‌ వెంటనే విచారణ జరిపించారు. దేవీకుమారిపై పారిశ్రామికవేత్త చేసిన ఆరోపణలు వాస్తవమని తేలడంతో ఆమెపై చర్యలకు ఆదేశించారు.