Asianet News TeluguAsianet News Telugu

''విశాఖ బాధితులకు కొత్త సమస్యలు... న్యూమోనియా లక్షణాలతో కలవరం''

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ బాధితులు మరిన్ని కొత్త సమస్యలతో బాధపడుతున్నారని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. 

Vizag Gas Leakage Incident... Another problem to victims: Vangalapudi Anitha
Author
Visakhapatnam, First Published May 9, 2020, 7:20 PM IST

విశాఖలో ఎల్జీ పాలిమర్ సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనలో 12మంది మృత్యువాత పడగా వందలాది మంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులకు సీఎం జగన్ నష్టపరిహారం ప్రకటించి వెళ్లి ప్యాలెస్ కి  వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారని...కానీ బాధితులు ఇంకా మృత్యువుతో  పోరాటం చేస్తున్నారని టిడిపి మహిళా అధ్యక్షురాలు  వంగలపూడి అనిత తెలిపారు. అసలు జగన్ విశాఖ ఎందుకెళ్లారు? యాజమాన్యాన్ని ఓదార్చడానికా, బాధితులను పరామర్శించడానికా? అని ఆమె ప్రశ్నించారు.                

''విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు ముఖ్యమంత్రి నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. విషవాయువును పీల్చి అస్వస్థతకు గురైన వారిని ఇప్పుడు కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. 554 మంది బాధితుల్లో 52 మంది చిన్నారులే ఉన్నారు. తాజాగా బాధితుల్లో శరీరం కమిలిపోతుంది. కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''తొలుత శరీరంపై దురద, మంట ఏర్పడుతోందని... అనంతరం చర్మం కమిలిపోయి బబ్బలు వస్తున్నాయి. దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిన్న పిల్లల భవిష్యత్ ను పాడు చేసారు. వారు పెద్ద వారైనా ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి'' అని అన్నారు.  

''రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేయాలి. చనిపోయిన వారికి కోటి ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ముఖ్యమంత్రి నష్ట పరిహారం ప్రకటించి వెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు, కానీ గ్యాస్ ప్రభావిత గ్రామాల ప్రజలు రోడ్ల పై ఉన్నారు. విశాఖ వెళ్లిన జగన్ కనీసం గ్యాస్ లీకేజీకి కారణమైన ఫ్యాక్టరీ ని ఎందుకు సందర్శించ లేదు'' అని నిలదీశారు. 

'' ఈ ఘటనకు కారణమైన ఫ్యాక్టరీ యజమాన్యాన్నీ భాదితులను పరామర్శించక ముందే ఎందుకు కలిశారు?  అసలు జగన్ విశాఖ ఎందుకు వెళ్లారు. బాధితులను పరిమర్శించ డానికా, లేక ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఓదార్చడానికా?ప్రభుత్వ వైఫల్యలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న జగన్ ప్రభుత్వం, నిర్లక్ష్యంగా వ్యహహరించి ప్రజల ప్రాణాలు తీసిన ఎల్జి పాలిమర్స్  కంపెనీ ప్రతినిధులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?''అంటూ ముఖ్యమంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు వంగలపూడి అనిత. 


 

Follow Us:
Download App:
  • android
  • ios