విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు బిజెపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నట్లు తెలుస్తోంది.

గత మూడు నెలలుగా ఆయన బిజెపి సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే సభలు, సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తరపున మళ్లీ పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానం విష్ణుకుమార్ రాజును వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన 15 ప్రశ్నలతో ప్రజానాడిని తెలుసుకోవడానికి ఆయన మిత్రబృందం నియోజకవర్గంలో సర్వే చేయించినట్లు సమాచారం. 

ఫలితం ఆయనకు అనుకూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో తిరిగి పోటీ చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. అయితే,  ఎక్కువ మంది ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడిపికి ఓటు వేస్తామని సర్వేలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.