రాజీనామాలకు సిద్దం: ఏపీ భవన్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికల ధర్నాలో టీడీపీ ఎంపీ
ఢిల్లీ ఏపీ భవన్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన తెలిపారు. రెండో రోజూ ఏపీ భవన్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్ మద్దతుగా నిలిచాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని నేతలు కేంద్రాన్ని కోరారు.
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మంగళవారం నాడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగారు. ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా నిన్న జంతర్ మంతర్ వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు.ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు తదితరులు మద్దతు పలికారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామాలకు తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ సంస్థలను అమ్మే ధైర్యం కేంద్రానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ వ్యతిరేకమని బెజవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామంటే ఊరుకొనేది లేదన్నారు. పార్లమెంట్ లో ఈ విషయమై పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి కేంద్రం తీరును తప్పుబట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన చెప్పారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు.