అందంగా ముస్తాబై పెళ్లిదుస్తుల్లో ఫించన్ల పంపిణీ... నెల్లూరు వాలంటీర్ పనికి నెటిజన్లు ఫిదా..!

ప్రజా సేవ కోసం నియమించబడిన ఓ వాలంటీర్ వృత్తిధర్మం కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించారు. చివరకు పెళ్ళిన కూడా పక్కనపెట్టి తన పని తాను చేసుకుని ఆదర్శంగా నిలిచారు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళా వాలంటీర్.  

village volunteer distributes pensions on wedding day in nellore district

నెల్లూరు:  ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జగన్ సర్కార్ వాలంటీర్ల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే వైసిపి పార్టీ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ వాలంటీర్లను నియమించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కొందరు వాలంటీర్లు తమ పనితీరుతో వారి ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇలా నెల్లూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ పెళ్లిరోజున కూడా ప్రజాసేవ చేసి ఆ తర్వాతే పెళ్ళిపీటలెక్కింది.ఆమె అంకితభావాన్ని చూసి వాలంటీర్ వ్యవస్థను విమర్శించేవారు కూడా ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు. 

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లికి గ్రామానికి చెందిన కె.రమాదేవి వాలంటీర్ గా పనిచేస్తోంది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమయ్యింది. నిన్న బుధవారం (జూన్ 1న) మంచి ముహూర్తం వుండటంతో పెళ్లికి పెద్దలు నిశ్చయించారు. అనుకున్నట్లే పెళ్లికి అన్ని ఏర్పాటు జరిగిపోయాయి. 

అయితే ప్రతినెల ఒకటవ తేదీన తప్పకుండా ప్రజలకు ఫించన్లు అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వ వాలంటీర్లకు అప్పగించింది. దీంతో రమాదేవి పెళ్ళిరోజున కూడా గ్రామంలో ఫించన్ల పంపిణీ చేపట్టింది. పెళ్లికూతురిగా ముస్తాబయిన ఆమె ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు ఫించన్ డబ్బులు అందించింది.  ఫించన్ల పంపిణి పూర్తయిన తర్వాతే పెళ్లిమండపానికి చేరుకుంది. ఇలా పెళ్లిరోజున కూడా ఫించన్లు పంపిణీ చేసిన వాలంటీర్ రమాదేవిని అధికారులు, ఫించన్ దారులు, గ్రామస్తులు అభినందించారు. 

ఇలా పెళ్లికూతురు ఫించన్ పంపిణీ చేస్తుండగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది ఆమె తాను చేపట్టిన వృత్తిపట్ల చూపిన అంకితభావం అందరినీ ఆకట్టుకుంది. దీంతో రమాదేవిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. 

అందంగా ముస్తాబయి పెళ్లిదుస్తుల్లో మెరిసిపోతూ ఫించన్లు పంపిణీ చేపట్టిన వాలంటీర్ రమాదేవి మిగతా వాలంటీర్లకు ఆదర్శంగా నిలిచారు. చేసే పనిపట్ల ఇలాంటి నిబద్దత కలిగివున్నపుడే మనం ఎందులో అయినా రాణించగలమని... రమాదేవికి కూడా మంచి భవిష్యత్ వుండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios