అనంతపురం: ప్రేమించుకున్నారు. మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో పంచాయితీ పెట్టారు. పంచాయితీలో గ్రామపెద్దలు ఆగ్రహానికి గురయ్యారు. 

ప్రేమించడం నేరంగా భావించడంతోపాటు, యువకుడికి యువతి వరుస కాకపోవడంతో మరింత రెచ్చిపోయిన గ్రామపెద్దలు దాడికి దిగారు. మైనర్ బాలికపై విచక్షణారహితంగా దాడికి దిగారు. గొడ్డును బాదినట్లు బాదారు. 

చిన్నపిల్ల అని కూడా చూడకుండా పెద్ద కర్రలతో దాడికి దిగడమే కాదు కాళ్లతో తన్నాడు. జుట్టుపట్టుకులాగాడు. తన సహనం కోల్పోయి అత్యంత అమానుషంగా యువతిపై దాడికి పాల్పడ్డాడు. దెబ్బలు తాళలేక యువతి పడిపోయినా గ్రామస్థులు పైకి లేపి మరీ కొట్టించిన దయనీయ పరిస్థితి. 

ఈ అమానుష ఘటన ఏ బీహార్ లేక ఉత్తరప్రదేశ్ అనుకుంటే పొరబాటే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రేమించుకున్న పాపానికి ఇద్దరు మైనర్లపై పంచాయితీ పెద్ద దాడికి దిగాడు. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదాడు. 

బోరున విలపిస్తున్నా కూడా పట్టించుకోలేదు. మైనర్ బాలిక అని కూడా చూడకుండా కడుపులో తన్నుతూ, చెంప చెళ్లుమనిపిస్తూ కొడుతూనే ఉన్నారు. కర్రలతో తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. దాడికి సంబంధించి విచారణ చేపట్టారు.