విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి సామాన్య ప్రజలే  కాదు  రాజకీయ నాయకులు కూడా బలవుతున్నారు. అలా తాజాగా విజయవాడ సెంట్రల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కరోనాతో మృతి చెందాడు. దీంతో నగరంలో మరింత టెన్షన్ మొదలయ్యింది. 

ఇటీవల తీవ్ర ఆయాసంతో ఆసుపత్రికి వెళ్లిన వైసిపి నాయకుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. రెండు రోజులుగా ప్రభుత్వాసుపత్రిలోనే వెంటిలేటర్ పై ఉన్నాడు, అయినప్పటికి అతడి ప్రాణాలు దక్కలేదు. ఆదివారం శ్వాస తీసుకోవడం మరింత ఇబ్బందిగా మారి మృతిచెందాడు. 

ఈ మృతితో    అతడు పోటీకి నిలిచిన డివిజన్ లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో అతడు డివిజన్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయడమే కాదు వాయిదా పడ్డాక లాక్ డౌన్ సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో వున్నాడు. డివిజన్ ప్రజలకు కూరగాయలు, చీరలు, రంజాన్ తోఫా అందించాడు.  దీంతో  ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు భయంతో వణుకుతున్నారు. 

read more   ఒక్క రోజులోనే అత్యధికం: ఏపీలో 8,929కి చేరిన కరోనా కేసులు

ఏపీలో గత కొద్దిరోజులుగా రోజుకు 300కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఈ  క్రమంలోనే ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కోవిడ్ 19 సోకినట్లు అధికారులు గుర్తించారు.

 పోడూరు మండల పరిధిలోని జిన్నూరు గ్రామం భూపయ్య చెరువు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఐదు రోజుల క్రితం ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్థారించారు.దీంతో కుటుంబసభ్యులు ఏడుగురికి అదే రోజు పరీక్షలు నిర్వహించారు. పరీక్షా ఫలితాల ఆధారంగా వీరికి కరోనా నిర్థారణ కావడంతో  చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

జిన్నూరులోని సుబ్బారాయుడు కాలనీలో మరొకరికి కూడా నిర్థారించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కరోనా బాధితులకు సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపడున్నారు.ఇప్పటి వరకు పోడూరు మండలం జిన్నూరులో 38 మంది, పోడూరులో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని పోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.