తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొగల్రాజపురం దోపిడీ కేసును బెజవాడ పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు.

డా మురళీధర్ ఇంట్లో 50 లక్షలు దోపిడీ చేసి దొంగలు పరారయ్యారని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కృష్ణ ,గుంటూరు జిల్లాలకు చెందిన నాగేంద్ర బాబు ,జోహాన్ వెస్లీ ,సాయి కిరణ్ , అఖిల్ ,విజయ్ లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

వీరిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు చెప్పారు. నిందితుల నుంచి 34 లక్షల 75 వేల నగదు , రెండున్నర లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు శ్రీనివాసులు పేర్కొన్నారు.

పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైన ఘటనపైనా దర్యాప్తు చేస్తున్నట్లు కమీషనర్ స్పష్టం చేశారు.

సిసిఫుటేజ్  పరిశీలిస్తున్నామని.. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. దుర్గగుడి సింహాల దొంగతనం కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.

ఈ ఘటన దృష్ట్యా నగరం లో అన్ని దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసులు వెల్లడించారు. దేవాలయ కమిటీలు ఆలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సీపీ సూచించారు.