8న విజయవాడ దుర్గమ్మ దర్శనమిచ్చేనా..? కలెక్టర్ ను క్లారిటీ కోరిన ఈవో
ఈ నెల 8వ తేదీన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చే విషయంపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది.
విజయవాడ: కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా దేశంలోని ప్రముఖ ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఈనెల 8వ తేదీ నుండి వీటిని తెరుచుకోడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ దర్శనంపై మాత్రం ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. ఈ ఆలయాన్ని తెరవాలా...వద్దా అన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఇంద్రకీలాద్రి కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా...లేదా అనే దానిపై అధికారులు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీంతో దుర్గగుడి అధికారులు కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో తెలపాలని కలెక్టర్ ను కోరారు దుర్గగుడి ఈవో సురేష్ బాబు.
ఇంద్రకీలాద్రి కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్, భవానీపురం, కొండదిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా దేవాదాయ శాఖ నుంచి ఇంకా అనుమతులు రాలేదట. దీంతో ఈ నెల 8న అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. దేవాదాయ శాఖ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు.
read more గుడ్‌న్యూస్: జూన్ 11 నుండి భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం
కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి జూన్30 వరకు పొడిగించింది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో కొనసాగించనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు. అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని తెలిపింది.
ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. పరిస్థితులను బట్టి జూలై నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని... అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు.
కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్ధాయి లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాత్రివేళల్లో కర్ఫ్యూను కూడా సడలించారు. ఇప్పటిలా 7 గంటల నుండి కాకుండా రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.
ఇక జూన్ 8 తర్వాత సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, బార్లు, మెట్రో రైల్లు, జిమ్ లు, ఆడిటోరియంలను తెరించేందుకు అనుమతినివ్వలేదు. సభలు,సమావేశాలు మరీ ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం కొనసాగనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగనుంది.