తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్‌వార్‌లో అనేక కొత్త విషయాలు  వెలుగులోకి వస్తున్నాయి. తోట సందీప్, కేటీఎం పండుల మధ్య భూ వివాదాలతో పాటు వ్యక్తిగత వైరం కూడా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వివాదాస్పద భూముల వ్యవహారంలో రెండు వర్గాలు జోక్యం చేసుకున్నాయి.

బెజవాడలో ల్యాండ్ సెటిల్‌మెంట్లకు గుంటూరు జిల్లా నుంచి, గుంటూరు జిల్లాలో వివాదాలకు బెజవాడ యువకులను ఈ గ్యాంగ్‌లు తమ వెంట తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read:బెజవాడ గ్యాంగ్‌వార్: ఎవ్వరినీ వదలేది లేదన్న పోలీస్ అధికారులు

ఇతర ప్రాంతాల నుంచి యువకులను తీసుకొస్తే పోలీసులు గుర్తుపట్టే అవకాశం ఉండటంతో ఇలా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సందీప్, పండు గ్యాంగ్‌వార్‌లో రెండు జిల్లాల వారు పాల్గొన్నారు. సందీప్, పండులకు సంబంధించిన టిక్‌టాక్, ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌ను పోలీసులు విచారించనున్నారు. 

కాగా ఈ గ్యాంగ్ వార్‌లో  గాయపడ్డ తోట సందీప్ కుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. ఆటోనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సందీప్ అనుచరులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.

దీనిని తొలుత రెండు విద్యార్ధి గ్రూపుల మధ్య వివాదంగా అంతా భావించారు. మీడియాలో సైతం ఇదే రకమైన కథనాలు వచ్చాయి. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read:బెజవాడ గ్యాంగ్‌వార్‌లో ఓ వ్యక్తి మృతి: ఆసుపత్రిలో అనుచరుల ఆందోళన

రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. నగరంలోని యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఈ వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకే స్థలం విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో గొడవ జరిగింది.

ఇంతటి విలువైన ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు ఇరువర్గాలు పథకం వేశాయి. రాజీ కుదుర్చుకునేందుకు వచ్చిన ఇరు వర్గాలు ఆ ముసుగులో పథకాన్ని అమలు చేయడానికి రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పక్కా ప్లాన్‌తో కత్తులు, కర్రలతో వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.