హైదరాబాద్: ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, చిత్తశుద్ధితో పనిచేస్తానని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని ప్రమాణం చేసి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 

 

ఐపీఎస్ శిక్షణ సమయంలో చేసిన ప్రమాణం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రజల కోసం ఏమైనా సేవ చేశారా అంటూ నిలదీశారు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయడుపైనా మండిపడ్డారు. ఎన్నికలంటే ఏంటి? ఎవరో డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇంకొకరు ఖర్చుచేసి గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరిగేది ఇలాగే గదా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదంటూ ట్వీట్ చేశారు. ఈ పెద్ద మనిషి ప్రజాస్వామ్యాన్ని ఈసీ పరిహాసం చేసిందని దేశమంతా తిరుగుతూ రంకెలు వేస్తున్నాడంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.