వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ పాలన చూసి తమ పార్టీలోకి చేరేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు.

శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా ఎవరెవరు వైసీపీలోకి వస్తున్నారన్న ప్రశ్నలకు విజయసాయి పై విధంగా స్పందించారు.

కాగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యతను  సంతరించుకున్నాయి.