చంద్రబాబు తాను నివాసం ఉంటున్న ఎస్టేట్ ని తక్షణం ఖాళీ చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు, దేవీనేని ఉమాలపై విజయసాయి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

‘‘చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగంనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరు. నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు.’’ అని విజయసాయి పేర్కొన్నారు.

‘‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంటు కంటే సినిమా సెట్టింగుల్లో వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌నే ఎక్కువగా వాడినట్టు కనిపిస్తోంది.కోటి ఖర్చయ్యే తాత్కాలిక నిర్మాణానికి రూ.9కోట్ల ఖర్చయినట్టు చూపారు.ఇదో చిన్న నమూనానే. చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలన్నీ ఇలాగే ఉంటాయనిపిస్తోంది.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

‘‘ప్రజావేదిక షెడ్డు కూల్చివేతను చూసేందుకు వచ్చిన ప్రజలకున్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకపోవడం దురదృష్టం. రాజధాని కోసం మా నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. ప్రజా వేదికను కరకట్టకు బదులుగా ఆ భూముల్లోనే కట్టి ఉంటే ఇవాళ ప్రజాధనం వృధా అయ్యేది కాదు కదా అని ప్రశ్నించారు.’’ అని విజయసాయి చెప్పారు.

అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమాపై కూడా మండిపడ్డారు. పోలవరం విషయంలో దేవినేని గతంలో చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విజయసాయి గుర్తు చేశారు.


‘‘ఉత్తర కుమారుడు ఎలా ఉంటాడో నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఉమా! 2018 జూన్‌కల్లా పోలవరంలో నీళ్ళు నిలబెడతాం. రాసుకో సాక్షి పేపర్లో అని ప్రగల్భాలు పలికినప్పుడే ఆ పేరు నీకు స్థిర పడింది. నీ అవినీతి పుట్ట పగిలే టైం వచ్చింది కాస్త ఓపిక పట్టు.’’ అని దేవినేనిని ఉద్దేశించి అన్నారు.